ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడి) పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన కెమిస్టుల బంద్ జమ్మికుంట పట్టణంలో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. పట్టణంలోని మెడికల్ షాపులన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి.
ఆన్‌లైన్ ద్వారా నియంత్రణ లేకుండా మందుల విక్రయాలు జరుగుతుండటం, నకిలీ మందులు మార్కెట్లో పెరుగుతుండటం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరిగి యువత చెడు అలవాట్ల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్మికుంట కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బంద్‌కు పూర్తి సహకారం అందించిన జమ్మికుంట కెమిస్టు సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పైడిమర్రి వెంకటేశ్వర్లు, కెఆర్వీ నరసయ్య, వెంకన్న, భాస్కర్ లింగం, శ్యామ్ కిషోర్, రమేష్, దేవేందర్, సత్యం, ప్రసాద్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments