బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం ఎల్కతుర్తి రహదారి.
ఎల్కతుర్తి, మే 22(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తా మెయిన్ రోడ్డుపై జరుగుతున్న నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న బావికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు పూర్తి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కనీసం బావి చుట్టూ కంచె గాని, రక్షణ గోడ గాని నిర్మించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అదే రోడ్డులో వైన్స్ షాప్ సమీపంలో ఈ బావి ఉండటంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ప్రమాదవశాత్తు బావిలో పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమీపంలో పాఠశాలలు ఉండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు తెలియక బావి దగ్గరకు వెళ్లినా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్లు వాటిని పూర్తిగా విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోందని విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే పనుల పూర్తికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బావి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో లైటింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశముందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


Comments