అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను మరవొద్దు.
ఎల్కతుర్తి, మే 24 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్ డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మండల కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా పుట్ట ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా మర్రి అమరేందర్, ఉపాధ్యక్షుడిగా మేకల రాజయ్య, సహాయ కార్యదర్శిగా వంగ రమేష్, కోశాధికారిగా జూపాక శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు.
నిమ్మల మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తొలి దశ 1969లో ప్రారంభమై వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారని, రెండో దశ ఉద్యమంలో కూడా వేలాది మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
అయితే ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.10 లక్షల ఆర్థిక సహాయం, పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఉద్యమ సమయంలో పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులను కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వేలాది మంది కళాకారులు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కొద్ది మందికే పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, హెల్త్ కార్డు, బస్సు మరియు రైలు పాస్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుట్ట ప్రతాప్, కార్యదర్శి అమరేందర్, ఉపాధ్యక్షుడు మేకల రాజయ్య, కార్యదర్శి రమేష్, కోశాధికారి జూపాక శ్రీనివాస్, కమలాబాయి,
శ్రీలత, వజ్రమ్మ, విజ్జమ్మ, భాగ్యమ్మ, శాంతమ్మ, మేకల రాజకుమారి, పల్లె సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.


Comments