పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలి.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
వనపర్తి,ఆగస్టు11(తెలంగాణ ముచ్చట్లు):
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సిబ్బందిని సద్వినియోగం చేసుకుని ప్రసవాల సంఖ్యను పెంచాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య సిబ్బందిని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు.మంగళవారం పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సంబంధించిన వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి గర్భిణికి తప్పనిసరిగా రక్తహీనత (అనీమియా) పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న గర్భిణులకు అవసరమైన మందులు, పోషకాహారంపై సూచనలు అందించి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం ప్రసవ గదిని (లేబర్ రూమ్) పరిశీలించిన కలెక్టర్ అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రసవాలకు వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జ్వరం, జలుబు, ఒంటినొప్పులతో ఆసుపత్రికి వచ్చే రోగులకు తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ పరిమళ, మెడికల్ ఆఫీసర్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments