వందే భారత్ అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక..
-సంచలనాత్మక కథనాలకు కేరాఫ్..
-నాడు డాక్టరేట్,నంది అవార్డు.. నేడు వందే భారత్ అవార్డు..
-వెల్లువెత్తుతున్న అభినందనలు..
-ప్రస్తుతం పీపుల్స్ డైరీ ఖమ్మం ప్రతినిధిగా విధులు
ఖమ్మం బ్యూరో , ఆగష్టు 11(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ వందే భారత్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు.. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ గత 13 సంవత్సరాలుగా వివిధ ఛానెల్స్, పత్రికల్లో, వివిధ హెదాల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. అనేక అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వాల ద్వారా వాటిని పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ విధంగా సమాజానికి సేవచేస్తూ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నందుకు అతని సేవలను గుర్తించి ఈ నెల ఆగష్టు 15వ తేదీన శనివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ 2వ అంతస్థు లో జరిగే వందే భారత్ అవార్డు పురస్కారం కార్యక్రమంలో ప్రముఖ సినీ గీత రచయిత జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా ప్రధానం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ "పీపుల్స్ డైరీ" దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిథిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సంచలనాత్మక కథనాలను అందించారు. ఎక్కడ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నా ఎలాంటి శక్తుల ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా వార్తలు అందించడంలో దిట్ట... జర్నలిజం వృత్తినే శ్వాసగా... నైతిక విలువలను పాటిస్తూ పేదల పక్షాన నిలువడం, అన్యాయాన్ని ఎదురించడం లక్షణం.. అక్రమార్కుల బెదిరింపులకు వెరువకుండా, అక్రమ కేసులకు సైతం భయపడకుండా ఎంచుకున్న దారిలో దూసుకెళ్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వందే భారత్ జాతీయ అవార్డు రావడం పట్ల స్థానిక సీనియర్ జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలుపుతూ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.


Comments