కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన.
కుషాయిగూడ, ఆగస్టు 11 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
యువకుడు కత్తితో కాలనీలో తిరుగుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనతో కాలనీలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడు? అతడి ప్రవర్తనకు కారణమేంటి? అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


Comments