మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం.!
- రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా భవనాలకు వర్చువల్ శంకుస్థాపన.
- ఇందిరమ్మ చీరల కొత్త డిజైన్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి.
సత్తుపల్లి, మే 25 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్వయం సహాయక బృందాల గ్రామ సంఘ మహిళా భవనాలకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “ఇందిరమ్మ చీరల” కొత్త డిజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళలను ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించే రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీల ద్వారా మహిళా సంఘాలకు అందించిందన్నారు. సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.1,395 కోట్లను బ్యాంకులకు చెల్లించినట్లు వివరించారు. మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాల అభివృద్ధి, సమగ్ర సామాజిక-ఆర్థిక ప్రగతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ 
కార్యక్రమం నిదర్శనమని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ మహిళా సంఘాలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.


Comments