కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్,మే 24(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రస్తుతం మండుతున్న ఎండలు, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా పొలాల్లో వరి కోయ్యలు, గడ్డి అవశేషాలు కాల్చడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని తాటి చెట్లు, పంట తోటలు, వ్యవసాయ సామగ్రి, విద్యుత్ వైర్లు దగ్ధమైన ఘటనలు జరిగినట్లు తెలిపారు.
రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలని, పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. చిన్న పొరపాటు వల్ల పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఎండ గాలులు ఎక్కువగా వీస్తున్న సమయంలో మంటలు అదుపు తప్పి సమీప గ్రామాల వరకు వ్యాపించే అవకాశముందని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదాల వల్ల రైతులకు ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ భూముల్లో మంటలు పెట్టే ముందు రైతులు ఒకసారి ఆలోచించాలని, గ్రామస్థులు కూడా అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అధికారులు కూడా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments