అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
ఖమ్మం బ్యూరో , జూన్ 10(తెలంగాణ ముచ్చట్లు )
అర్హులైన ప్రతి ఓటరు డ్రాఫ్ట్ జాబితాలో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 10 లక్షల మంది వరకు ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందన్నారు. వివిధ కారణాల వల్ల మిగిలిన 20 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగలేదని తెలిపారు. ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని, బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు సకాలంలో స్పందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని స్పష్టం చేశారు.
మ్యాపింగ్ పూర్తయిన ప్రతి ఓటరు కూడా తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలని, ఫారం సమర్పించని పక్షంలో వారి పేరు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉండదని స్పష్టం చేశారు. అనంతరం అభ్యంతరాలు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి సమస్యలు తలెత్తుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో అనామలీలను గణనీయంగా తగ్గించగలిగామని, గతంలో 30 శాతం ఉన్న అనామలీలను ప్రస్తుతం 20 శాతానికి తగ్గించామని తెలిపారు. 80 శాతం మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో సిస్టమ్ ద్వారా గుర్తించిన అనామలీలకు నోటీసులు జారీ చేసి పరిశీలన చేపడతామని చెప్పారు.
తండ్రి-కొడుకు సంబంధంగా మ్యాపింగ్ చేసిన ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నా, తాత-మనవడు సంబంధంగా నమోదు చేసిన వారి మధ్య తక్కువ వ్యత్యాసం ఉన్నా వాటిని అనామలీలుగా పరిగణించి నోటీసులు జారీ అవుతాయని తెలిపారు.
అనామలీల సమస్య పరిష్కారానికి పూర్తి ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో గుర్తించిన లోపాలు గల ప్రతి అనామలీ ఓటరుకు నోటీసులు జారీ చేసి, వారి వివరణలు స్వీకరించి సవరణలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం ప్రక్రియను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆధారాలతో భద్రపరుస్తామని తెలిపారు.
అనామలీలుగా గుర్తించిన ఓటర్ల వద్ద సంబంధిత పత్రాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు జూలై 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించి కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు.
పాత ఎస్‌ఎస్‌ఆర్ జాబితాలో ఉండి మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని, రేషన్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్ల ప్రస్తుత స్థితి, గ్రామంలోనే నివసిస్తున్నారా, జీవించి ఉన్నారా లేదా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా వంటి వివరాలను సేకరిస్తామని తెలిపారు. జనన తేదీలను కూడా పరిశీలిస్తామని చెప్పారు.
జూలై 1, 1987కు ముందు భారతదేశంలో జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరి అయినా ఒకరి జనన లేదా గుర్తింపు పత్రం సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తారని తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్ల నుంచి ఫారాలతో పాటుగుర్తింపు పత్రాలు కూడా సేకరిస్తారని, అనామలీ ఓటర్ల సమస్యలను అవసరమైన పత్రాల ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు.
జూలై 31, 2026న డ్రాఫ్ట్ ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తమ పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని సూచించారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు స్వీకరిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి అక్టోబర్ 1, 2026న తుది ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బీఎల్‌వో వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్,బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు బెల్లం వేణుగోపాల్, రమేష్, పి. నాగరాజు, బీజేపీ ప్రతినిధులు రాజేష్, వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గోపాలరావు, సత్యనారాయణ, సిపిఎం డి.తిరుపతి, ఎన్.వీరబాబు, ఆప్ ప్రతినిధి పి.శ్రీనివాస్, టీడీపీ పాలడుగు టిఆర్ కృష్ణప్రసాద్, బిఎస్పి సిహెచ్ నాగేశ్వర రావు, ఎం.నాగేశ్వర రావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments