బక్రీద్ రోజున కబరస్థాన్‌కు తాళం.!
ప్రార్థనలకు వెళ్లిన ముస్లింల ఆవేదన.
సత్తుపల్లి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌లో ఉన్న కబరస్థాన్ వద్ద బక్రీద్ సందర్భంగా గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన ముస్లింలకు గేటుకు తాళం వేసి ఉండటంతో తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానిక ముస్లింల కథనం ప్రకారం.. ఎన్టీఆర్‌నగర్‌లోని జెండాల చెట్టు సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని గత 70 ఏళ్లుగా స్మశానవాటికగా వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది బక్రీద్ రోజున పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. అలాగే మేకల బలి, చిన్నారుల చెవులు కుట్టించడం వంటి సంప్రదాయ కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. అయితే ఈ స్థలం అటవీ శాఖ ఆధీనంలో ఉందని, అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేస్తున్నారని మసీదు కమిటీ సభ్యులు తెలిపారు. గత 15 ఏళ్లుగా పండుగలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పూర్వీకుల సమాధులు ఇదే ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. బక్రీద్ సందర్భంగా గురువారం ఉదయం వంద మందికి పైగా ముస్లింలు ప్రార్థనల కోసం కబరస్థాన్‌కు చేరుకోగా గేటు మూసి ఉండటంతో అక్కడే నిలిచిపోయారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని వాపోయారు. కనీసం పండుగ రోజునైనా ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని అటవీ శాఖ అధికారులతో మాట్లాడి కబరస్థాన్ స్థలాన్ని ముస్లింల వినియోగానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సదర్ షేక్ ముజ్బుల్ రహమాన్, సయ్యద్ ఫయాజ్ (కార్యదర్శి), షేక్ సఫిఉల్లా (ముఖ్య సలహాదారు), షేక్ నజీమ్ (కోశాధికారి), మహబూబ్ పాషా, షేక్ రహమాన్, చంద్‌పాషా, యాసిన్, కరీముల్లా, బాజీ, లాలు, పాషా, జిన్నీ, అబ్దుల్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.


Comments