విద్యావంతమైన సమాజ నిర్మాణానికి బీజేపీ ప్రత్యేక చొరవ.
ఎల్కతుర్తి, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యావంతమైన సమాజ నిర్మాణమే దేశాభివృద్ధికి బలమైన పునాది అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండలంలో “మనబడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలల పరిసరాలను శుభ్రపరచడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
బడికి దూరంగా ఉన్న చిన్నారులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు, సమాజ ప్రగతి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన అనంతరం కూడా ఇంటి వద్దే ఉండిపోయే పిల్లలను గుర్తించి, ఒక్క చిన్నారి కూడా విద్యకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, ప్రజాప్రతినిధి, గ్రామస్థుడిపై ఉందన్నారు.
“ప్రతి బిడ్డ బడిలోకి – ప్రతి గ్రామం విద్యాభివృద్ధి వైపు” అనే లక్ష్యంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“మనబడి బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది.. విద్యావంతమైన సమాజమే అభివృద్ధి చెందిన భారతానికి పునాది” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.


Comments