దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.
పాఠశాలలు, అంగన్‌వాడీలు, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె.
దమ్మపేట, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో రూ.1.20 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, చిన్నారుల సంక్షేమానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాలకు నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. బాలరాజుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దిబ్బగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. మెండివారి గ్రామంలో రూ.11.80 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. నాగుపల్లిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, చిన్నారుల విద్య, పోషకాహారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తొట్టిపంపులో ఎంపీయూపీఎస్ పాఠశాలకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను, లింగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొర్రెగుట్టలో ఎంపీపీఎస్ పాఠశాలకు రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. మారప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో రూ.8 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని, పాత చీపురుగూడెంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతేనే పల్లె పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, భద్రతా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులకు అనుకూల వాతావరణం సృష్టించడం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పట్టణ విద్యార్థులతో సమానంగా పోటీపడే స్థాయికి ఎదగడం సమాజం బాధ్యత అని అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రోడ్లు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.


Comments