ఓటరు జాబితాలో తప్పుడు వివరాలకు చట్టపరమైన చర్యలు.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):
ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు.ఓటరు జాబితా తయారీ, సవరణ లేదా పేర్ల చేర్పు, తొలగింపులకు సంబంధించి తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడం నేరమని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు పాల్గొని, బూత్ లెవల్ అధికారులు అందజేసే ఫారాలను సక్రమంగా పూరించి సమర్పించాలని కోరారు. ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసేటప్పుడు నిబంధనలను పాటిస్తూ సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. దీంతో ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


Comments