జీతాల జాప్యంతో 108 ఉద్యోగుల ఆందోళన.
మహబూబ్‌నగర్,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):
ఆపదలో ప్రజలకు అండగా నిలిచే 108 అంబులెన్స్ సిబ్బంది ప్రస్తుతం జీతాల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 అంబులెన్సుల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి నిధులు విడుదల చేసి, ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.


Comments