ఇందిరా నగర్ అభివృద్ధికి నాంది పలికిన సర్పంచ్ అంబాల రాజు కుమార్.
ఎల్కతుర్తి జూన్ 17( తెలంగాణ ముచ్చట్లు )
ఎల్కతుర్తి మండలంలోని ఇందిరా నగర్ గ్రామ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. గ్రామంలో నూతన మహిళా సమైక్య భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అంబాల రాజు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్, ఎంపీఓ కె. కవిత ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంబాల రాజు కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా మహిళా సమైక్య భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అన్నారు.
గ్రామంలోని మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. మహిళల సాధికారతతోనే గ్రామాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, వారి సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళా సమైక్య భవనం నిర్మాణం గ్రామ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ కోరే లావణ్య, వార్డు సభ్యులు, గ్రామ వివో అధ్యక్షురాలు గొర్రె శ్రీలత, గ్రామ సీఏ తాడూరి సుమలత, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంబాల రమేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కడారి రాజారాం, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments