రైతుల పక్షాన నిరంతర పోరాటమే నా ధ్యేయం .
మాజీ ఎంపీ నామ.
ఖమ్మం బ్యూరో, జూన్ 20(తెలంగాణ ముచ్చట్లు )
రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17వ లోక్‌సభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రైతుల సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎన్నోసార్లు ప్రస్తావించి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, విస్తృత స్థాయిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలియజేశారు. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థ కువెన్నెముక అని, రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న పంట కొనుగోలు సమస్యలు, గిట్టుబాటు ధరలు, సాగునీటి ఇబ్బందులు, ఎరువులు, విత్తనాల కొరత, విద్యుత్ సమస్యలు వంటి అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకొచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసి, రైతు కుటుంబాలకు భరోసా కల్పించి, తెలంగాణను వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు. ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలనే విధానాన్ని నాడు కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్దేశించిన కోటాకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే రైతు సంఘాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉంటుందని, రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అన్నదాతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసారు.


Comments