పామాయిల్‌తో రైతు కుటుంబాల్లో వెలుగులు.
- రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం.
- ఉమ్మడి జిల్లాల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు
- మంత్రి తుమ్మల.
దమ్మపేట, జూన్ 21(తెలంగాణ ముచ్చట్లు):
ఒకప్పుడు వరి, పత్తి, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలకే పరిమితమైన దమ్మపేట–అశ్వారావుపేట ప్రాంతం నేడు పామాయిల్ సాగుకు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగును పది లక్షల ఎకరాలకు విస్తరించి రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దమ్మపేట మండలం మల్లారం, గుత్తావారిగూడెం గ్రామాల రైతులు నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. గిరిజనుల సంప్రదాయ కొమ్ము నృత్యంతో మంత్రికి స్వాగతం పలికిన రైతులు, పామాయిల్ సాగు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఘనంగా సన్మానించారు. సభలో పలువురు రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పామాయిల్ సాగుకు పునాది వేసింది తుమ్మలేనని గుర్తు చేశారు. చెక్‌డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారుల నిర్మాణంతో వ్యవసాయానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. పామాయిల్ వల్ల రైతుల ఆదాయం పెరగడంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, ఒకప్పుడు వ్యవసాయం అంటే వెనుకడుగు వేసిన కుటుంబాలు నేడు పామాయిల్ రైతులతో బంధుత్వాలకు ముందుకొస్తున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర, స్థిరమైన మార్కెట్ ఉండటంతో పాటు వాతావరణ ప్రభావం తక్కువగా ఉండడం ఈ పంట ప్రత్యేకత అని చెప్పారు. పామాయిల్ తోటల్లో కోకో, జాజి, వక్క వంటి అంతర పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments