ప్రాణాలు పోతున్నా పట్టించుకోని విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వేలాడే తీగలే సాక్ష్యం.
–దామరలో కరెంట్ షాక్‌తో పాడి ఆవు, పెంపుడు కుక్క మృతి
–రైతు కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు
ఎల్కతుర్తి, జూలై 7 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామర గ్రామం కొత్తపల్లి శివారులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు కరెంట్ షాక్‌కు కారణమై ఒక పాడి ఆవు, పెంపుడు కుక్క మృతి చెందగా, రైతు కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
దామర గ్రామానికి చెందిన మంతుర్తి మొగిలి (తండ్రి కొమురయ్య) కుటుంబానికి సర్వే నంబర్ 524లో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై నుంచి చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయని, పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత మరమ్మతులు చేయకుండా తాత్కాలికంగా తీగలను అతికించి వదిలేశారని బాధిత రైతు ఆరోపించారు.
మంగళవారం అకస్మాత్తుగా విద్యుత్ తీగ తెగి నేలపై పడటంతో మేతకు వెళ్లిన పాడి ఆవు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రోజుకు సుమారు 10 లీటర్ల పాలు ఇస్తూ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న పెంపుడు కుక్క కూడా కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది.
ఆవు లేవడం లేదని భావించిన రైతు కుమారుడు చింటూ దగ్గరకు వెళ్లి ముట్టుకోగా అతనికీ కరెంట్ షాక్ తగిలింది. స్థానికులు అప్రమత్తమై వెంటనే సహాయం చేయడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ప్రాణాలు పోతున్నా పట్టించుకోని విద్యుత్ శాఖ.. నిర్లక్ష్యంగా వేలాడే తీగలే సాక్ష్యం" అని మండిపడ్డారు. ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ తీగలను వెంటనే తొలగించి కొత్త తీగలు ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన పాడి ఆవుకు తగిన నష్టపరిహారం మంజూరు చేసి బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు, రైతులు విజ్ఞప్తి చేశారు.



Comments