వడ్డెరల అభ్యున్నతికి నూతన నాయకత్వం.
మండల అధ్యక్షుడిగా గొల్లెన ఎల్లయ్య నియామకం.
ఎల్కతుర్తి, జూలై 19 (తెలంగాణ ముచ్చట్లు):
వడ్డెరల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎల్కతుర్తి మండల వడ్డెర సంఘానికి నూతన నాయకత్వం ఏర్పాటైంది. తెలంగాణ వడ్డెర సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బొంత రమేష్ అధ్యక్షతన ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు ముఖ్య అతిథిగా హాజరై, మండలంలోని వివిధ గ్రామాల కుల పెద్దల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా గొల్లెన ఎల్లయ్య (దండేపల్లి), ప్రధాన కార్యదర్శిగా అల్లెపు ప్రశాంత్ (దామెర), కోశాధికారిగా అల్లెపు రాజు (దామెర)తో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పట్టణ అధ్యక్షుడు, యూత్ ఇన్‌చార్జిని ఏకగ్రీవంగా నియమించారు.
ఈ సందర్భంగా శివరాత్రి అయిలమల్లు మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో మూడు వేలకుపైగా వడ్డెరలు నివసిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం బలమైన మండల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వడ్డెర సంఘం ఎన్నో ఏళ్లుగా కోరుతున్న న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు.
వడ్డెరలకు విద్య, ఉపాధి, గృహాలు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించి వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ, రాష్ట్ర కోశాధికారి గుర్రం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వల్లెపు సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర రవీందర్, జిల్లా కోశాధికారి వల్లెపు సాంబరాజు, జిల్లా ఉపాధ్యక్షులు వల్లపు సుధాకర్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు వల్లపు రంజిత్ కుమార్, ధర్మసాగర్ మండల ఉపాధ్యక్షులు వల్లపు వెంకన్న, వివిధ గ్రామాల కుల పెద్దలు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


Comments