ఎన్‌ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి ఉత్తీర్ణత.
చర్లపల్లి, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీలలో విద్య, స్వీయాభివృద్ధి, పునరావాసాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. ఖైదీలు విద్యను కొనసాగించేలా జైళ్ల శాఖ ఎన్‌ఐఓఎస్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా చర్లపల్లి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారానికి చెందిన 108 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీలో నమోదు చేసుకున్నారు. వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించి, వారి వేతనాలను జైళ్ల శాఖ భరించింది.
ఏడాది పాటు తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డు పరీక్షలతో కూడిన క్రమబద్ధమైన విద్యా ప్రణాళిక ద్వారా ఖైదీలను పరీక్షలకు సిద్ధం చేశారు. ఫలితంగా చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 56 మంది, నిజామాబాద్ కేంద్ర కారాగారం నుంచి 15 మంది, హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 78 మంది ఉత్తీర్ణులయ్యారు. జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ ఉత్తీర్ణులైన ఖైదీలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఖైదీలు ప్రదర్శించిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసాన్ని ఆమె ప్రశంసించారు. విద్య ద్వారా జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు.
ఉత్తీర్ణులైన 78 మంది ఖైదీలకు ప్రత్యేక రిమిషన్
విద్యపై ఖైదీలు చూపిన కృషి, క్రమశిక్షణకు గుర్తింపుగా ఎన్‌ఐఓఎస్ ద్వారా ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించిన 78 మంది ఖైదీలకు డైరెక్టర్ జనరల్ ప్రత్యేక రిమిషన్‌ను ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ఇతర ఖైదీలు కూడా విద్య వైపు అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తుందని డీజీ తెలిపారు.
ఉత్తీర్ణులైన ఖైదీలను ఎన్‌ఐఓఎస్ ద్వారా సీనియర్ సెకండరీ (10+2) విద్య కొనసాగించేలా ప్రోత్సహించనున్నారు. మరో 47 మంది ఖైదీలు తాజాగా ఎస్‌ఎస్‌సీలో నమోదు చేసుకున్నారు. 10+2 పూర్తి చేసిన అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా బీఏ కోర్సుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. అలాగే ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన 78 మంది ఖైదీలు చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఐటీఐలో వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించేందుకు అర్హులని డీజీ తెలిపారు. విద్య, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో స్వయం ఆధారిత జీవితం వైపు సాగాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో ఎన్‌ఐఓఎస్ జాయింట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ పరంప్రీత్ సింగ్, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ డా. ప్రవీణ్ చౌహాన్, జైళ్ల శాఖ ఐజీ వై. రాజేష్, డీఐజీలు డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, పలువురు జైలు సూపరింటెండెంట్లు, అధికారులు, ఎన్‌ఐఓఎస్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.


Comments