అమ్మపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెద్దమందడి,ఆగస్టు13( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పాలనా సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన పాలన, ప్రజా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.అనంతరం గ్రామంలో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూమిపూజ చేశారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి భవనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అమ్మపల్లి గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవి వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు క్యామ నవనీత రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, పెద్దమందడి మండలాధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ. సత్యరెడ్డి, గట్టు యాదవ్, శ్రీనివాసులు, బాలు, సర్పం
చులు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments