పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్ కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి.
జవహర్‌నగర్, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
జవహర్‌నగర్‌లో పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ పూసల సంఘం అధ్యక్షుడు మధ్యబోయిన రాజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూసల సంఘం సమస్యలను వివరించారు. జవహర్‌నగర్‌లో గత 24 ఏళ్లుగా వివిధ కుల సంఘాలకు కుల భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారని, అదే విధంగా పూసల సంఘానికి కూడా స్థలం కేటాయించాలని మధ్యబోయిన రాజు కోరారు. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో పూసల సామాజిక వర్గానికి చెందిన 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. తమ సామాజిక, కుటుంబ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సొంత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. స్థలం కేటాయిస్తే సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం, కాప్రా తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. పూసల సంఘం అధ్యక్షుడు మధ్యబోయిన రాజు మాట్లాడుతూ.. “జవహర్‌నగర్‌లో పూసల సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఎంతో అవసరం. 200కు పైగా పూసల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కార్యక్రమాలు, ఫంక్షన్లు, సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, కాప్రా తహసీల్దార్ దయతలచి స్థలం కేటాయించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకన్న, ప్రధాన కార్యదర్శులు పగిడిపల్లి నవీన్‌కుమార్, మర్రి శీను, సహాయ కార్యదర్శులు చిన్నిపల్లి రజిత, మధ్యబోయిన శారద, పసులేటి కవిత, చేని చింటూ, కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments