రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ
జమ్మికుంటలో మాదిగ హక్కుల దండోరా జిల్లా సమావేశం..
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
దేశంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోకముందే రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేయడం సామాజిక న్యాయాన్ని తిరస్కరించడమేనని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ అన్నారు. ఆదివారం జమ్మికుంటలో నిర్వహించిన జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా స్పందించారు.
రిజర్వేషన్లు ఎవరి దయతో వచ్చినవి కావని, రాజ్యాంగం కల్పించిన హక్కు అని శంకర్ మాదిగ స్పష్టం చేశారు. కుల వివక్షను నిర్మూలించకుండా రిజర్వేషన్లను తొలగించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని, అన్ని వర్గాలు ఐక్యంగా నిలిచి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పుకుంటున్నప్పటికీ పేదలకు నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఆర్థిక భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఎందుకు అందడం లేదని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో ప్రజల సంక్షేమానికి ఎంత నిధులు ఖర్చవుతున్నాయో ప్రభుత్వాలు స్పష్టమైన లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం
దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని సబ్సిడీ రుణాలు అందించింది, ఎంతమంది దళిత యువతకు స్వయం ఉపాధి కల్పించింది, ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎంతమేర నిధులు విడుదలయ్యాయి అనే పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.
దళితుల పేరుతో బడ్జెట్‌లో నిధులు కేటాయించడం మాత్రమే కాకుండా, ఆ నిధులు దళిత కుటుంబాల జీవితాల్లో ఎంతమేర మార్పు తీసుకొచ్చాయో ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత యువతకు రుణాలు, ఉపాధి, విద్య, భూమి, వ్యాపార అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం
రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు దళితుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం మాదిగ హక్కుల దండోరా నిరంతరం పోరాడుతుందని శంకర్ మాదిగ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఎదుర్కొనేందుకు తెలంగాణ నుంచి మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల కుమారస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ మాదిగ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి దొడ్డే రాజేందర్ మాదిగ, మోతె స్వామి మాదిగ, మందమర్రి పట్టణ అధ్యక్షుడు కొలుగూరి విజయ్‌కుమార్ మాదిగ, ఇల్లందు మండల అధ్యక్షుడు స్వామిదాస్ మాదిగ, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు దొడ్డే రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments