డీఏవీ జాతీయ క్రీడలకు 28 మంది ఎంపిక.
సత్తుపల్లి, ఆగస్టు 24(తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారంలోని సాయి స్ఫూర్తి డీఏవీ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 22, 23 తేదీల్లో బీడీఎల్ భానూర్‌లోని డీఏవీ పాఠశాలలో జరిగిన పోటీల్లో పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొనగా 28 మంది డీఏవీ జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. చెస్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-17 బాలికల చెస్‌లో ప్రథమ స్థానం, అండర్-19 బాలుర వాలీబాల్‌లో ప్రథమ స్థానం, అండర్-19 బాలుర కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్‌లోనూ పలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. అండర్-17 బాలికల షాట్‌పుట్‌లో గౌరి ప్రియా, బాలుర షాట్‌పుట్‌లో వివేక్ వర్ధన్, అండర్-14 బాలికల 800 మీటర్ల పరుగులో నైనిషా, అండర్-17 బాలుర 400 మీటర్ల పరుగులో లిబిల్ ప్రథమ స్థానాలు సాధించారు. అండర్-14 బాలికల 400 మీటర్ల పరుగులో అక్షర కె., అండర్-17 బాలికల 100 మీటర్ల పరుగులో లాస్యారెడ్డి తృతీయ స్థానాలు పొందారు. లాంగ్‌జంప్‌లో అక్షర ఎం., పి.దీక్షిత్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అండర్-19 బాలుర షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జి.కె.జి. గౌతమ్ ప్రథమ స్థానాలు సాధించాడు. డిస్కస్‌త్రోలో వివేక్ వర్ధన్, వై.గౌరిప్రియా ప్రథమ స్థానాల్లో నిలిచి బహుళ స్వర్ణ పతకాలు సాధించారు. విద్యార్థుల కృషిని పాఠశాల ప్రిన్సిపాల్ తణుకు శేషసాయిశ్రీ అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు చూపిన పట్టుదల, క్రమశిక్షణ, సమిష్టి కృషి అభినందనీయమన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు కె.కుమారస్వామి, ఎం.రామ్‌శెట్టి, బి.శ్యామ్‌కుమార్‌లను, విజేతలను పాఠశాల హానరరీ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి, డీఏవీ ఏపీ జోన్-ఎ రీజనల్ ఆఫీసర్ జి.ఆర్.కె.ప్రసాద్, చైర్మన్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి బండి అన్విద అభినందించారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


Comments