మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మందికి చీరలు.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం చీరలు పంపిణీ చేశారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 27 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ములుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ గుట్టల మల్లికార్జున్ చేతుల మీదుగా చీరలు అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన అనంతరం తన తల్లి పేరుతో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన పెన్షన్ డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, సమాజంలోని పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ సేవాభావం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసినందుకు ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని, వాటికి తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి వెన్నెముక లాంటి వారని అన్నారు. ప్రతిరోజూ ఉదయం వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్న వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గుర్రం కావ్య పరశురాములు, శీలం శ్రీనివాస్, కొల్లూరి సురేష్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


Comments