భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
ఆరేళ్ల విచారణకు తెర..
ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించిన హుజూరాబాద్ కోర్టు
ఇల్లందకుంట, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో 2019లో చోటుచేసుకున్న భూ వివాదం కేసులో హుజూరాబాద్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది.
గడ్డివానిపల్లికి చెందిన ఎలవేని రఘుపతి సుమారు 35 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 18 గుంటల భూమిని ఆయన తండ్రి తమకు తెలియకుండా విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గడ్డి మహేష్ (ఉపసర్పంచ్), గడ్డి కొమురయ్య, గడ్డి రాజు, గడ్డి తిరుపతి, సిరిసేడు గ్రామానికి చెందిన బీనవేని ఎర్రయ్యలు రఘుపతిపై దాడి చేసినట్లు కేసు నమోదైంది.
దాడిలో తీవ్రంగా గాయపడిన రఘుపతిని కుటుంబ సభ్యులు తొలుత జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై రఘుపతి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరేళ్ల విచారణ అనంతరం తీర్పుకేసు ఆరేళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్ కోర్టు ఐదుగురినీ దోషులుగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించింది.
కేసు విచారణ సందర్భంగా కోర్టు వాయిదాలకు ఇరువర్గాలను హాజరుపరచడంలో విధులు నిర్వర్తించిన కోర్టు కానిస్టేబుల్ జన్నే రాజేష్‌ను హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ వెంకట్‌గౌడ్, ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ అభినందించారు.


Comments