ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.

23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసినట్లు వెల్లడి.

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.

కొత్తకోట,ఆగస్టు27(తెలంగాణ ముచ్చట్లు):

ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కొత్తకోట పోలీసులు ఛేదించారు. ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, వారి నుంచి రూ.2 లక్షల నగదును రికవరీ చేసినట్లు వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఓడి రమేష్‌, ఎస్సై ఎం. విక్రంతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు.విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి ప్రయత్నిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఎస్సై ఎం. విక్రం ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాను చుట్టుముట్టారు. పోలీసులను గమనించిన ఐదుగురు నిందితులు వాహనాలను అక్కడే వదిలి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఐదు జిల్లాల్లో 23కు పైగా చోరీలు
పోలీసుల విచారణలో నిందితులు గత ఎనిమిది నెలలుగా పలు జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 4, నారాయణపేట జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2 చోరీ కేసులకు సంబంధించి మొత్తం 23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ముందుగా రెక్కీ.. ఆపై చోరీ
ముఠాలోని ఏ-1 డాకూరి పెద్ద లింగన్న అలియాస్‌ డక్కలి లింగా, ఏ-2 మహంకాళి కిషోర్‌ ముందుగా బైక్‌లపై వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రదేశాలను గుర్తించి రెక్కీ నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి సమయంలో బజాజ్‌ ట్రాలీ ఆటో, టాటా ఏస్‌ ట్రాలీ ఆటో, బైక్‌లపై మిగతా నిందితులతో కలిసి అక్కడికి చేరుకునేవారని వెల్లడించారు.ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే జంపర్‌ వైర్లను కట్‌ చేసిన అనంతరం, వెంట తెచ్చుకున్న పనిముట్లతో ట్రాన్స్‌ఫార్మర్‌ను తెరిచి అందులోని కాపర్‌ కాయిల్‌ను తొలగించేవారని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో సుమారు 40 నుంచి 45 కిలోల వరకు కాపర్‌ కాయిల్‌ ఉంటుందని నిందితులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.కిలో రూ.200కు కాపర్‌ విక్రయం.చోరీ చేసిన కాపర్‌ కాయిల్‌ను గుర్తుతెలియని వ్యాపారులకు కిలోకు సుమారు రూ.200 చొప్పున విక్రయించేవారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఏ-1, ఏ-2 వద్ద ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని ముఠా సభ్యులు సమానంగా పంచుకునేవారని విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై ఎం. విక్రం, భాస్కర్‌ తదితర పోలీసు సిబ్బందిని డీఎస్పీ బాలాజీ అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టుల పాదయాత్రకు అపూర్వ స్పందన.! జర్నలిస్టుల పాదయాత్రకు అపూర్వ స్పందన.!
- ఎమ్మెల్యే మట్టా రాగమయి.- జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నాం.- ఇంటి స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగే వారిని నమ్మొద్దు.- డాక్టర్ మట్టా...
ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.
ఉద్యోగుల డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
మేఘారెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకుందా?
విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం.
తిమ్మాపురం ఘటనకు న్యాయం చేయాలి.. లేదంటే ఉద్యమం.
గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారుల పరిశీలన.