తిమ్మాపురం ఘటనకు న్యాయం చేయాలి.. లేదంటే ఉద్యమం.
- నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
- మారుపాక అనిల్ కుమార్
ఎల్కతుర్తి, ఆగస్టు 26 ( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపురం గ్రామంలో దళితుడైన కొలుగూరి రమేష్‌పై జరిగిన దాడి ఘటనలో బాధితుడికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని చేపడతామని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ హెచ్చరించారు.
బుధవారం తిమ్మాపురం గ్రామానికి వెళ్లిన ఆయన బాధితుడు కొలుగూరి రమేష్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడి జరిగి ఆరు రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని వర్తించే సెక్షన్లను నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ ఘటనలో గ్రామ సర్పంచి పాత్రపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడికి, ఆయన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వం తక్షణ ఆర్థిక, వైద్య సహాయం అందించాలని కోరారు.
దళితులపై దాడులు, అవమానాలు, సామాజిక బహిష్కరణ వంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు డీహెచ్‌పీఎస్ అండగా నిలుస్తుందని, అధికారులు వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్, రాష్ట్ర సమితి సభ్యులు రొంటాల దేవా, మర్రి శ్రీనివాస్, శేనిగరపు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments