జర్నలిస్టుల పాదయాత్రకు అపూర్వ స్పందన.!
- ఎమ్మెల్యే మట్టా రాగమయి.
- జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నాం.
- ఇంటి స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగే వారిని నమ్మొద్దు.
- డాక్టర్ మట్టా దయానంద్ .
సత్తుపల్లి, ఆగస్టు 27 (తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు సత్తుపల్లి పట్టణంలో అపూర్వ స్పందన లభించింది. అమర జర్నలిస్టు షోయబుల్లాఖాన్ 78వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 22న ఆయన జన్మించిన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని విగ్రహం వద్ద ప్రారంభమైన పాదయాత్ర గురువారం సత్తుపల్లి పట్టణానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి స్థానిక జర్నలిస్టులతో పాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బోస్ బొమ్మ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సాగిన ప్రదర్శన అనంతరం సుభాష్ చంద్రబోస్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో టిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నిని బాలు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా రూ.5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ విధంగా నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్యే తానేనని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం స్థలాన్ని కూడా పరిశీలించామని, ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులేనని, వారికి ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దని హెచ్చరించారు. ఇంటి స్థలాల పేరుతో డబ్బులు అడిగే వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. టిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బట్టిపాటి రాజశేఖర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులను సాధారణ పౌరులుగా గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాగమయి గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే జర్నలిస్టుల సంక్షేమాన్ని గుర్తించి సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం లేదని, ఈ విషయంలో ఎమ్మెల్యే రాగమయి ముందడుగు వేయడం అభినందనీయమని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఐసీడీఎస్ శాఖ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌ను సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, మధుబాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ పురపాలక సంఘం అధ్యక్షుడు కూసంపూడి మహేష్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మాజీ వార్డు కౌన్సిలర్ మల్లూరు అంకంరాజు తదితరులు పాదయాత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించి పోరాటానికి సంఘీభావం తెలిపారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, ఐద్వా నాయకురాళ్లు జాజిరి జ్యోతి, కుమారి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత శరత్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పాలకులను స్పందింపజేసే జర్నలిస్టులు తమ సొంత ఇళ్లు, ఇంటి స్థలాల కోసం పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి రావడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో వామపక్షాలు ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతాయని హెచ్చరించారు. స్థానిక జర్నలిస్టులు ఎండీ షైబుద్దీన్, బి.వి. రామారావు తదితరులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం పాదయాత్ర బృందం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పించాలని
కోరుతూ తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మధుకీర్తి, చీపీ గంగాధర్, సుధాకర్, మల్లూరు చంద్రశేఖర్, ఆరెంపుల హరిబాబు, అఫ్జల్, గోదా నాగబాబు, గుంట్రు సూర్యతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments