1000 రోజుల కాంగ్రెస్ పాలనను చూసి బీఆర్ఎస్‌కు కళ్లుమంటున్నాయి.
కౌశిక్‌రెడ్డి ఉనికి కోసమే దొంగ డ్రామాలు : వొడితల ప్రణవ్.
కమలాపూర్,సెప్టెంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు ):
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతుండటాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నామని అన్నారు.
“ఎమ్మెల్సీగా రెండున్నరేళ్లలో నువ్వేం తెచ్చావో.. ఇంచార్జిగా నేనేం తీసుకొచ్చానో రుజువు చేస్తా.. సిద్ధమా?” అంటూ కౌశిక్‌రెడ్డికి ప్రణవ్ సవాల్ విసిరారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం వంటి పథకాలు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నూతన రేషన్ కార్డులు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, నూతన బస్ రూట్లు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కమలాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించామని, రాబోయే రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లతో పాటు హుజురాబాద్, జమ్మికుంటలో మరిన్ని డబుల్ బెడ్‌రూం ఇళ్లను పేదలకు అందిస్తామని చెప్పారు.
కమలాపూర్‌కు కౌశిక్‌రెడ్డి చేసిందేమీ లేదు
కమలాపూర్ మండల అభివృద్ధికి కౌశిక్‌రెడ్డి ఎలాంటి కృషి చేయలేదని ప్రణవ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణానికి వచ్చిన నిధులను కూడా ఎమ్మెల్సీగా ఉండి ఇప్పించలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు సమకూర్చడంతో పాటు మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కమలాపూర్ మండలానికి మంజూరైన శ్మశాన వాటిక నిధులను వీణవంకకు తరలించారని ఆరోపించిన ప్రణవ్.. ఇది కౌశిక్‌రెడ్డి పనితీరుకు నిదర్శనమన్నారు. కమలాపూర్‌లో ఇప్పటికే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలకు కౌశిక్‌రెడ్డి సమాధానం చెప్పాలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆ పార్టీ నాయకురాలు కవిత చేసిన ఆరోపణలకు ముందుగా కౌశిక్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే కాంగ్రెస్ గురించి మాట్లాడాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు ప్రత్యక్ష సాక్ష్యాలని, కౌశిక్‌రెడ్డి ఒక్కసారి కళ్లుతెరిచి వాటిని చూడాలని వొడితల ప్రణవ్ అన్నారు. కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments