డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
- సకాలంలో స్పందించిన 108 సిబ్బంది.
- అంబులెన్స్‌లోనే అత్యవసర వైద్యం.
సత్తుపల్లి, ఆగస్టు 29(తెలంగాణ ముచ్చట్లు):
పొలం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా సిమెంట్ డ్రైనేజీలో పడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ నూర్ అహ్మద్ (30) పొలం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఇంటి ముందు ఉన్న సిమెంట్ డ్రైనేజీలోకి వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో నూర్ అహ్మద్ డ్రైనేజీలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. తలకు తీవ్ర గాయం కావడంతో చర్మం మొత్తం దెబ్బతిని రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) గొల్లమందల కృష్ణ, పైలెట్ పాలడుగు వేణు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించి, మార్గమధ్యంలోనూ అత్యవసర వైద్య సేవలు అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అత్యవసర వైద్యం అందించిన 108 సిబ్బందిని గంగారం గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా 108 ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ సిబ్బందిని అభినందించారు.


Comments