గ్రామాల బాట పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ఐదు గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం.
ఎల్కతుర్తి, ఆగస్టు 29 ( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గ్రామాల బాట పట్టారు. ఎల్కతుర్తి మండలంలోని సూరారం, దండేపల్లి, వీరనారాయణపురం, వల్లభాపూర్, ఇంద్రనగర్ గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు, ప్రధాన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై వినతులు సమర్పించారు.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఐదు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments