జమ్మికుంటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
* భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..
* కృష్ణనామస్మరణతో మార్మోగిన వేడుకల ప్రాంగణం
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్బరవేన రాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణంలో వైభవంగా సాగాయి.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల కృష్ణనామస్మరణతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ హాజరై శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ సత్యం, న్యాయం, మానవతా విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అబ్బరవేన రాజు యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ వేడుకల్లో యాదవ సంఘం నాయకులు, భక్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో జమ్మికుంట పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.


Comments