కిడ్నాప్ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 2(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు గౌరవ ఖమ్మం మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ప్రథమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీ అరవ ప్రవీణ్ మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్లు త్రీ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జె. మోహన్ బాబు తెలిపారు. ముగ్గురికి కలిపి రూ.15 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.
కేసు వివరాల ప్రకారం.. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన కిడ్నాప్ కేసులో చక్కిలెల @ నాగమళ్ల సతీష్, చక్కిలెల సంతోష్, చక్కిలెల సుమన్ నిందితులుగా ఉన్నారు.
2018 ఏప్రిల్ 20వ తేదీ రాత్రి ఖమ్మం కిన్నెరసాని థియేటర్ ఎదురుగా ఉన్న కిరాణా జాగిరి మర్చంట్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ కార్యక్రమం సందర్భంగా కొత్త విశ్వనాథంతో నిందితులు గొడవకు దిగారు. అనంతరం అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి, ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కొత్త గీత 2018 ఏప్రిల్ 21న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలతో నిందితులపై అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ముగ్గురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్ యు. వెంకన్న బాబు, ప్రస్తుతం ఇల్లందు ఉప పోలీసు అధికారి, విధులు నిర్వహించారు. కేసు విచారణలో ఇన్‌స్పెక్టర్ జె. మోహన్ బాబు సమన్వయంతో, ప్రభుత్వ న్యాయవాది శ్రీమతి ఎస్. గాయత్రి సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
కేసు దర్యాప్తు, న్యాయస్థాన ప్రక్రియలో సీడీవో వి. రామకృష్ణ, న్యాయస్థాన సమన్వయ అధికారులు కె. శ్రీకాంత్, కె. శ్రీనివాస్, డి. నాగేశ్వరరావు సహకరించారు. కేసు విచారణలో సమర్థవంతంగా సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


Comments