కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.
ఖమ్మం బ్యూరో , ఆగస్టు, 31(తెలంగాణ ముచ్చట్లు )
అధికార కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వైఫల్యలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వర రావు అధ్యక్షతన నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వెయ్యి రోజులు గడుస్తున్నా కూడా నేటికీ ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పాలన వైఫల్యం పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సమర శంఖం పూరించిందన్నారు. వారం రోజుల పాటు పలు అంశాలపై ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సెప్టెంబర్ 2న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. వ్యవసాయ రంగానికి సాగు నీరు విడుదల చేయకుండా, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా, యూరియా సరఫరాలో వైఫల్యాలపై 3వ తేదీన నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, వికలాంగులకు నాలుగు వేల పింఛన్, మహిళలకు రెండు వేల పింఛను ఇవ్వకుండా మోసం చేసిందుకు నిరసనగా4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని అన్నారు. విద్యార్థులు, యువకులకు విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వైఖరిని ఎండ గడుతూ 5వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ లు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ కే తల మాణికమైన సింగరేణి బొగ్గు గనులను కాంగ్రెస్ అనుయాయులకు దోపిడీ కేంద్రాలుగా మార్చినందుకు నిరసన సదస్సులు, గ్రామ పంచాయతీల్లో పడకేసిన పారిశుద్యంపై, నిధులు లేక నీరసించిన పాలనపై ఆరో తేదీన నిరసన కార్యక్రమాలు రూపొందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల ప్రకారం ప్రజలకు రావాల్సిన బాకీలపై 7వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పించాలన్నారు. చివరిగా కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ.. 8 వ తేదీన అంబేద్కర్ గారి విగ్రహాలకు వినతి పత్రాల అందజేయాలని ఎంపీ రవిచంద్ర పార్టీ షెడ్యూల్ వివరించారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు మాట్లడుతూ.. అడ్డగోలు హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు తొందరలోనే గ్రహించారని, రాబోయే రోజులు ఆ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో అన్నిచోట్ల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కార్పొరేటర్లు వేల్పుల దామోదర్, భీమా శ్రీధర్, మల్హోత్రా సాగర్, మంతపురి రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, గోవాడ గుణ చరిత్, గుగులోత్ రాంబాబు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాధం, మల్లెల శ్రీరామమూర్తి, కొట్టి వెంకటేశ్వర్లు, లావుడ్యా సత్య నారాయణ, మాజీ కౌన్సిలర్లు రుక్మాంగధర్, వేముల ప్రసాద్ బాబు, అంబుల వేణు, మాజీ ఎంపీపీ లు బాదావత్ శాంతి, భూక్యా సోన, నాయకులు ముద్దంగుల మహేష్, ఏమునరి శివ, కరాటే శ్రీను, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments