వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
రేవంత్ సర్కార్ వైఖరిపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం.
వనపర్తి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):
వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం కృష్ణా వరద జలాలను మాత్రమే వినియోగించాల్సి ఉండగా, నికర జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సాగునీటి విషయంలో కాంగ్రెస్‌ది మొదటి నుంచీ వ్యతిరేక వైఖరేనని ఆరోపించారు.జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ జలచర్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు పేరుతో కృష్ణా నికర జలాలను తరలిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తెలంగాణకు, పాలమూరు ప్రాంతానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డిపై నిరంజన్‌రెడ్డి
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సొంత నిధులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 2023 నాటికి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, టన్నెళ్లు, భూసేకరణ వంటి కీలక పనులు పూర్తిచేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేదని ఆరోపించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాకు భారీగా సాగునీరు అందే అవకాశం ఉందని, ప్రాజెక్టు ఆలస్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. జూరాలకు వరద వచ్చిన సమయంలోనూ నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
ఎస్ ఎల్ బి సి పనులపైనా విమర్శలు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ ఎల్ బి సి) పనుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో సొరంగ పనుల్లో కొంత భాగాన్ని పూర్తి చేశామని, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు.అవగాహన లేకుండా, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం తాము ఎన్నో ఏళ్లుగా పోరాడామని, పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments