బాల్య వివాహాల నిర్మూలనకు అంతర్జాతీయ గుర్తింపు.
చిన్నమ్మ థామస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వనపర్తి డైరెక్టర్ .
వనపర్తి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్న జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వనపర్తి సంస్థల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వనపర్తి డైరెక్టర్ చిన్నమ్మ థామస్ తెలిపారు. నవంబర్ 27వ తేదీని బాల్య, చిన్న వయసులో జరిగే, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.వనపర్తి జిల్లాలో బాల్య వివాహాల నివారణకు పాఠశాలలు, గ్రామాలు, పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చిన్నమ్మ థామస్ తెలిపారు. బాల్య వివాహాల ముప్పులో ఉన్న కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానించడం, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవం కోసం చేపట్టిన ప్రచారానికి పలు దేశాలు మద్దతు తెలిపాయని, సెప్టెంబర్
4న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. బాల్య వివాహాల పూర్తిస్థాయి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, అందుకోసం తమ సంస్థ కృషి కొనసాగిస్తుందని చిన్నమ్మ థామస్ పేర్కొన్నారు.


Comments