బీసీ ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి.
తెలంగాణ బీసీ కులాల సమితి ప్రభుత్వానికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతో పాటు పాలక మండళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ కులాల సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు ఫెడరేషన్లు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి పూర్తిస్థాయిలో చైర్మన్లు, పాలక మండళ్లు లేకపోవడంతో ఆయా వర్గాల సమస్యలు పరిష్కారం కావడంలో జాప్యం జరుగుతోందని సమితి ప్రతినిధులు తెలిపారు. బీసీ వర్గాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే పాలక మండళ్ల ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు.గతంలో ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లను ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలకు మార్గం సుగమం చేసిందని, ప్రస్తుతం వాటికి చైర్మన్లు, పాలక మండళ్లను నియమించడం ద్వారా బీసీ వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.అర్హత, సామాజిక సేవ, అనుభవం ఉన్న బీసీ నాయకులకు చైర్మన్ పదవులతో పాటు పాలక మండళ్లలో అవకాశం కల్పించాలని వారు కోరారు. అన్ని బీసీ కులాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం త్వరితగతిన నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు సమితి నాయకులు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసి తమ డిమాండ్లను వివరించారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఫెడరేషన్లను బలోపేతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కులాల సమితి అధ్యక్షులు శ్రీ దుర్గా రావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్, రాష్ట్ర కార్యదర్శి మరియు హైదరాబాద్ అధ్యక్షులు వన్నెం శంకర్, శ్రీకాంత్ చారీ తదితరులు పాల్గొన్నారు.


Comments