కరీంనగర్ నుంచే కాంగ్రెస్‌పై సమరభేరి:కేటీఆర్.
యువత పిడికిలి బిగిస్తే పిడుగుల వర్షమే.
హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వం రాజీనామా చేయాలి.
కరీంనగర్, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ చేపట్టిన ‘పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా? 1000 రోజులు గడిచినా హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, యువతకు రూ.10 లక్షల రుణాలు, యూత్ కమిషన్, ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ వంటి హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ‘జాబ్ క్యాలెండర్ లేదు.. స్కామ్ క్యాలెండర్ నడుస్తోంది’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కరీంనగర్ పోరాటాలకు పురిటిగడ్డ అని, యువత పిడికిలి బిగిస్తే పిడుగుల వర్షం కురుస్తుందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments