ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు.!
సత్తుపల్లి, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం సత్తుపల్లి పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి దయానంద్ విజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెయిన్ రోడ్డులోని రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు. పాత సెంటర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సమాజంలో విద్యకు ప్రత్యేక స్థానం ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని దయానంద్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు మానవీయ విలువలను పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, వార్డు కౌన్సిలర్లు, మండల విద్యాశాఖ అధికారి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments