పామాయిల్‌ సాగు విస్తరణకు ప్రత్యేక చర్యలు.

పామాయిల్‌ సాగు విస్తరణకు ప్రత్యేక చర్యలు.

దేశీయ వంట నూనెల అవసరాలు తీర్చేలా సాగు పెంచాలి.
- రైతుల సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
- దక్షిణాది వ్యవసాయ మంత్రుల సదస్సులో కీలక నిర్ణయాలు: తుమ్మల

 అశ్వారావుపేట  సెప్టెంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వారావుపేటఅశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఆయిల్‌పామ్‌ డివిజనల్‌ కార్యాలయంలో రైతులకు ఆయిల్‌పామ్‌ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. అనంతరం పామాయిల్‌ ఫ్యాక్టరీ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న పామాయిల్‌ ఫ్యాక్టరీ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ దేశంలో వంట నూనెల అవసరాలను తీర్చేందుకు పామాయిల్‌ సాగును మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం ప్రతి ఏటా వంట నూనెల దిగుమతుల కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల్లోనే పామాయిల్‌ సాగు జరుగుతోందని, 70 లక్షల ఎకరాల్లో సాగు విస్తరించినప్పుడే దేశీయ వంట నూనెల డిమాండ్‌ను గణనీయంగా తీర్చగలమన్నారు. దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి పామాయిల్‌ సాగును తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు తుమ్మల తెలిపారు. పామాయిల్‌ సాగు విస్తరణ, మద్దతు ధర, రైతాంగ సంక్షేమం వంటి అంశాలపై సదస్సులో చర్చించి, రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు. చీడపీడలను తట్టుకునే కొత్త రకం పామాయిల్‌ మొక్కలను రైతులకు అందిస్తున్నామని తుమ్మల తెలిపారు. తక్కువ ఎత్తులో పెరిగేలా పామాయిల్‌ మొక్కల్లో జన్యుపరమైన మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త వెరైటీలను అందుబాటులోకి తీసుకురావడంలో కొంత ఆలస్యం కారణంగా మొక్కల పంపిణీలో జాప్యం జరిగిందన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించి పామాయిల్‌ సాగును మరింత లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పామాయిల్‌ గెలలు కోసేందుకు స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గెలల కోత పనిముట్లను ఆధునీకరించడంతో పాటు రైతులకు, కూలీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం తలరాత మారుతుందని తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగర్‌ ఆయకట్టుకు సాగునీటి భరోసా కల్పించామని తెలిపారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని పంట పొలాలకు గోదావరి జలాలను తీసుకురావాల్సిన బాధ్యత తనదేనని తుమ్మల స్పష్టం చేశారు. పామాయిల్‌ తోటల్లో భూగర్భంలో సాగునీటి పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాలని కోరారు. పామాయిల్‌ సాగు చేసే ప్రతి ప్రాంతంలో డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. అశ్వారావుపేట ప్రాంతం తనకు రాజకీయ జన్మనిచ్చిందని తుమ్మల అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అశ్వారావుపేట అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో అశ్వారావుపేటకు మహర్దశ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో అత్యాధునిక సాంకేతికతతో మరో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెం వరకు నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నీటి ఎద్దడిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల సూచించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపడంతో పాటు వచ్చే ఏడాదికి గోదావరి జలాలను మండలాలకు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. తనకు జన్మనిచ్చిన ఈ ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమని, విద్య, వైద్యం, రహదారులు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తుమ్మల అన్నారు. “తన శ్వాస ఉన్నంతకాలం అశ్వారావుపేట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.”IMG-20260906-WA0002

Tags:

Post Your Comments

Comments

Latest News