మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
- స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి.
- అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.
సత్తుపల్లి, సెప్టెంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మార్చుకునేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. మహిళలు అవకాశాల కోసం ఎదురుచూడకుండా.. అవకాశాలను సృష్టించుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పెనుబల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల కోసం సెర్ఫ్, ఎస్‌బీఐ–ఆర్‌సెట్‌ఐ ఖమ్మం, ఉషాకిరణాలు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి మహిళలకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళలు సంఘాలుగా ఏర్పడి పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్న తీరు అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, శిక్షణలు, ఇతర ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు సొంతంగా వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదగాలని సూచించారు. జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ద్వారా మహిళలకు చేతివృత్తి నైపుణ్యంతో పాటు స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన జ్యూట్ బ్యాగులకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై ఉంటుందని, మహిళల ఆర్థిక బలోపేతంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మహిళలు చిన్నచిన్న స్వయం ఉపాధి కార్యక్రమాలతో ప్రారంభించి క్రమంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని, తాము ఎదగడంతో పాటు మరికొందరు మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల ఐక్యత, కృషి, ప్రభుత్వ సహకారం కలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్‌చౌదరి, ఏపీఎం, ఏపీవో, ఇ
న్‌చార్జి ఎంపీడీవో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి కౌన్సిలర్ తోట సుజలారాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బల్లి మనీషా, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments