ఎమ్మెల్యేల అరెస్ట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్.
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదు.
కరీంనగర్, సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని
అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో సబ్బండ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా సోమవారం కరీంనగర్ బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదని, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


Comments