ప్రజా అవసరాలే ప్రాధాన్యం.. అభివృద్ధే లక్ష్యం.
*ఆరెపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం*
*మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన*
కరీంనగర్, సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
నగరంలోని 1వ డివిజన్ ఆరెపల్లిలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
మున్సిపల్ సాధారణ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఆరెపల్లిలో నిర్మించనున్న సీసీ రోడ్డు పూర్తయితే స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను మేయర్ ఆదేశించారు. పనులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నాణ్యతలో రాజీ పడకుండా చూడాలని సూచించారు.
అభివృద్ధి పనులపై స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments