అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి.!
దమ్మపేట, సెప్టెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు):
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్‌లో ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ ఉద్యోగులను, అక్కడ ఆందోళన చేస్తున్న రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ మురారి రఘు మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులు అధిక పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నా.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచలేదన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎంసీ, ప్రీప్రైమరీ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, సెంటర్ హద్దులు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సూరమ్మ, జయ, వెంకటలక్ష్మి, సీతారామమ్మ, వజ్రమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Comments