చలంచర్లను సన్మానించడం విద్యారంగానికే గర్వకారణం.!
- ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం అభినందనీయం.
- మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు.
వేంసూరు, సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న మండల విద్యాశాఖ అధికారి చలంచర్ల వెంకటేశ్వరరావును సన్మానించడం విద్యారంగానికే గర్వకారణమని మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వేంసూరు మండల విద్యా వనరుల కేంద్రంలో చలంచర్ల వెంకటేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పగుట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. చలంచర్ల వెంకటేశ్వరరావు పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం సేవలందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ విద్యార్థుల హాజరు శాతం పెంపు, పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యారంగంలో మరింత స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నున్నా రాంబాబు, నాయుడు వెంకటేశ్వరరావు, కల్లూరుగూడెం బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వీర వెంకు వెంకటేశ్వరరావు, కొండ్రు రవి తదితరులు పాల్గొన్నారు.


Comments