దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.
తాత మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 11 ( తెలంగాణ ముచ్చట్లు):
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు కొయ్యడ రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్కతుర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
దళితుల మనోభావాలను కించపరిచేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తాత మధు తన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమానత్వం, గౌరవం, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పోగుల రమేష్ మాదిగ, జర్నలిస్ట్ ఫోరం మండల అధ్యక్షులు బొంకూరి వంశీ మాదిగ, మండల నాయకులు అడ్డూరి ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నమిండ్ల నరేష్ మాదిగ, ఎంఎస్పీ గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments