చెరువులు, కుంటలకు గోదావరి జలాలు నింపాలి.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మూడు గ్రామాల నాయకులు.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
కొత్తపల్లి, మీదికొండ, తాటికొండ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మల్లన్నగండి కుడికాలువ ద్వారా గోదావరి జలాలను మళ్లించి నీటితో నింపాలని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి తమ సమస్యను వివరించారు.
మల్లన్నగండి కుడికాలువ ద్వారా తాటికొండ గ్రామంలోని రేగులకుంట, బండ్లకుంట, తాళ్లచెరువుతో పాటు కొత్తపల్లి గ్రామంలోని బంజరు కుంటకు గోదావరి జలాలను నింపాలని నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ చెరువులు, కుంటలకు నీరు అందడం ద్వారా ఆయా గ్రామాల్లో సాగునీటి అవసరాలు తీరడంతో పాటు భూగర్భ జలమట్టాలు పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
నాయకుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ ముక్కెర స్వరూప రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పులిగిల్ల పార్వతి గట్టయ్య యాదవ్, తాటికొండ సర్పంచ్ మారపాక సృజన శ్రీను, మాజీ ఉపసర్పంచ్ మారపాక రాములు, మీదికొండ మాజీ సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు యాదవ్, నాయకులు కొండల్ రెడ్డి, మెతుకు నరసింహారెడ్డి, గంగుల జగన్ రెడ్డి, పులిగిల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments