దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి.
హుజూరాబాద్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
దళిత బంధు పథకం రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్‌లో లబ్ధిదారులు రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ దీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు.
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షకు సంబంధించిన గోడపత్రికను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎనుగు మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడతకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న దళిత బంధు నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రిలే నిరాహార దీక్షలకు దళిత బంధు లబ్ధిదారులు, దళిత సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments