రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట కేవీకేలో ప్రత్యక్ష ప్రసారం.
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసా
య, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కేంద్ర మంత్రి లైవ్ వెబ్‌కాస్ట్ కార్యక్రమాన్ని స్థానిక రైతులకు ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు పురుష, మహిళా రైతులు ఆసక్తిగా పాల్గొని కేంద్ర మంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రబీ సాగుకు సంబంధించి పలు ముఖ్యమైన సూచనలు, మార్గదర్శకాలను మంత్రి వివరించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. నేల పరీక్షల నివేదికల ఆధారంగానే సమతుల్య ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు సహజ వ్యవసాయ విధానాలు, జల సంరక్షణ పద్ధతులను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
వెబ్‌కాస్ట్ అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలను కేవీకే శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. రబీ పంటల సాగు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవసరమైన సూచనలు అందించారు.
కార్యక్రమంలో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త, హెడ్, వివిధ విభాగాల విషయ నిపుణులు, సిబ్బంది, కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments